కల్లెడ చిన్నారులకు అండగా నిలిచిన మానవత్వం…సత్యసాయి సేవా సమితి సేవలు ఆదర్శనీయం
జగిత్యాల :
జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ముగ్గురు చిన్నారుల దుస్థితి ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది.
ఈ విషాద ఘటనపై స్పందించిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల, మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తూ ఆ చిన్నారులకు భరోసా కల్పించింది.

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ద్వారా విషయం తెలుసుకున్న సత్యసాయి సేవా సమితి సభ్యులు వెంటనే కల్లెడ గ్రామానికి చేరుకొని, పిల్లల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామ మాజీ సర్పంచ్ గంగాధర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం, ప్రస్తుతం వృద్ధులైన అమ్మమ్మ, తాతయ్య పిల్లలను చూసుకుంటున్నారని గుర్తించారు.

గ్రామ పెద్దలు, బంధువులు కలిసి త్వరలోనే పిల్లలను ప్రభుత్వ హాస్టల్‌లో చేర్చడంతో పాటు వారి పేరుతో బ్యాంకు ఖాతా ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ పరిస్థితిని గమనించిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి వెంటనే స్పందించి, భక్తుల సహకారంతో తక్షణ సాయం అందించింది. ఒక నెలకు సరిపడే 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, పిల్లలకు అవసరమైన స్నాక్స్, దుప్పట్లు అందజేశారు.

అంతేకాకుండా పిల్లల చదువు బాధ్యతను కూడా సంస్థ స్వీకరిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే భక్తుల సహకారంతో సమకూరిన సుమారు రూ.35 వేల మొత్తాన్ని పిల్లల పేరున బ్యాంకు ఖాతా తెరిచి ఎఫ్‌డీ రూపంలో భద్రపరచనున్నట్లు తెలిపారు.
ఈ సేవా కార్యక్రమానికి అనేక మంది దాతలు స్పందించి తమ వంతు సహకారాన్ని అందించారు.
మంచిర్యాలకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్ పురుషోత్తం రూ.5,000 విరాళం అందించగా, దుబాయ్‌లో నివసిస్తున్న సారంగాపూర్ వాసి చుక్క అంజి రూ.2,001 విరాళం అందించారు. కోరుట్ల మండలం మాదాపూర్ తపాల కార్యాలయంలో పనిచేస్తున్న అహోబిలం సుష్మ రూ.516 విరాళం అందించారు. సారంగాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు ఏలేటి రాజేశ్వర రెడ్డి రూ.1,111 సహాయం చేయగా, వరంగల్‌కు చెందిన బోదె హిందు రెడ్డి రూ.2,000, సారంగాపూర్‌కు చెందిన సూర కోటేశ్వర్ రెడ్డి రూ.1,000, మహబూబాబాద్ కు చెందిన చోళ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ సాగర్ 2 వేలు, రామిడి తిరుపతిరెడ్డి 3000 విరాళంగా అందించారు.
ఇదే సమయంలో జగిత్యాలకు చెందిన ప్రముఖ పిల్లల వైద్యులు, అరుణ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి తక్షణమే స్పందించి తన ఆసుపత్రి సిబ్బందిని గ్రామానికి పంపించి పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలింపజేశారు. అవసరమైన నిత్యావసరాలు అందించడంతో పాటు, భవిష్యత్తులో కూడా వైద్య సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ సేవా కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ బట్టు రాజేందర్, ఉత్తూరి గంగాధర్, ఠాకూర్ నారాయణ్ సింగ్, పిప్పరి రాజేందర్, వంగల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనాథలైన చిన్నారులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరిపై భగవాన్ శ్రీ సత్యసాయి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని సేవా సమితి సభ్యులు ప్రార్థించారు.
ఈ సంఘటన మరోసారి సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించింది.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





