# Tags

ప్లాస్టిక్ బ్యాగ్ లు నివారించినప్పుడే అనారోగ్యం నుంచి దూరం అవుతాం- ప్రజలు అర్థం చేసుకోకుంటే ఇక ప్రమాదమే: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల :

ఆరోగ్యవంతమైన సమాజం కావాలనుకుంటే ప్లాస్టిక్ బ్యాగులను నివారించాల్సిందే, అది ప్రజల చేతుల్లోనే ఉంది… అంటూ, జగిత్యాల పట్టణ పరిశుభ్రత అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్న తరుణంలో ప్లాస్టిక్ బ్యాగులు నివారించకుంటే అనారోగ్యం తప్పదని ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు అర్థం చేసుకోకుంటే, ఇక ప్రమాదమేనని రొటేరియన్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ఆపి – రోటరీ క్లబ్ – ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణ పరిశుభ్రతలో ప్రధాన పాత్రధారులైన సుమారు 300 మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు శనివారం ఉదయం 5 గంటలకు మున్సిపల్ కార్యాలయం, LVR షాపింగ్ మాల్, ప్రధాన వ్యాపారం కూడలి టవర్, అంగడి బజార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలలో జనపనార బ్యాగులను పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ బి.రాజా గౌడ్, పాల్గొని ఈ బ్యాగులను పంపిణీ చేశారు.

రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మంచాల కృష్ణ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్య నిర్వహణ కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ తో పాటు రోటరీ క్లబ్ అధ్యక్షుడు చారి, పూర్వ అధ్యక్షుడు టీవీ సూర్యం, సభ్యులు కాశీరావు తో పాటు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ బొడ్ల జగదీష్ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయం వద్ద. ..

ఈ సందర్భంగా రొటేరియన్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ఆపి – అంతర్జాతీయ సంస్థ రోటరీ క్లబ్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పారిశుద్య కార్మికులకు జనపనార బ్యాగులు పంపిణీ చేసి, వారి ద్వారా పట్టణ పరిశుభ్రత పట్ల ప్లాస్టిక్ బ్యాగుల నివారణ కోసం ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు.

.

అంగడి బజార్ వద్ద. ….

గత నాలుగు దశాబ్దాలుగా సామాజిక కార్యక్రమాలను పట్టణంలో చేపడుతున్న ఆపి, రోటరీ క్లబ్, స్వచ్చంద సంస్థలు ఆహ్లాదకరమైన పార్క్ నిర్మాణం, సత్య హరిశ్చంద్ర స్మశాన వాటిక, ప్రధాన వ్యాపార కూడలి టవర్ లాంటి ప్రాంతాల కూడళ్లు ఆధునికరించడంలో తమ వంతుగా భాగస్వామ్యం అయ్యామని వివరించారు.

ప్రధాన వ్యాపార కూడాలి టవర్ వద్ద….

పట్టణంలో ప్రతి వార్డును, ప్రధాన రోడ్లను ఆధునికరించడంలో, అభివృద్ధి పరచడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ప్రభుత్వానికి తోడుగా స్వచ్ఛంద సంస్థలు సహకరించడం ఎంతో అవసరమని అన్నారు.

LVR షాపింగ్ మాల్ వద్ద. …

ఈ నేపథ్యంలోనే ఆపి, రోటరీ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లాంటి స్వచ్ఛంద సంస్థలు పారిశుధ్యం, ప్లాస్టిక్ రహిత సమాజం కార్యక్రమంలలో భాగస్వాములవుతూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు.

అలాగే మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ కార్మికులు ప్లాస్టిక్ నివారించడంలో ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

వారం రోజులపాటుగా విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అయినప్పటికీ ప్లాస్టిక్ బ్యాగులను వాడడం ఆపకపోతే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

ప్లాస్టిక్ వల్ల ఏ ఒక్కరికి క్యాన్సర్ వచ్చినా కనీసం ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు ఆర్థిక భారం పడుతుందని, అదే నిషేధిత ప్లాస్టిక్ బ్యాగులను నివారించినప్పుడు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతామని స్పష్టం చేశారు.

అలాగే పట్టణ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరగానే మంజూరు చేయడం జరిగిందని, ఇందుకుగాను ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు..