కరీంనగర్ లో నాలుగు కోట్ల బంగారం దోపిడీ ?
ఐదుగురు సాయుదులు పి ఎం జె జ్యువెలరీ షాపులోకి చొరబడి మేనేజర్, సిబ్బందిపై కాల్పులు
మేనేజర్ ముస్తాక్, సిబ్బంది కమలహాసన్, రాజేష్, మధుకర్ లకు తీవ్ర గాయాలు
హుటా హుటిన ఆసుపత్రికి తరలింపు
కరీంనగర్ , మే 3తెలంగాణ రిపోర్టర్ :

కరీంనగర్ జ్యోతి నగర్ ప్రాంతంలోని పీఎంజే జ్యువలరీ షాప్ లో ఆదివారం పట్టపగలు భారీ దోపిడీ జరిగింది. ఉదయం 11 గంటల 11 నిమిషములకు మొదట కస్టమర్ రూపంలో ఒక దుండగుడు షోరూమ్ లోకి ప్రవేశించి తనకు బంగారు చైన్ కావాలని, చూపించాల ని సిబ్బందిని కోరాడు.

అప్పుడే లాకర్ నుంచి ఆభరణాలు తీసుకువచ్చి సర్దుతున్న షోరూం సిబ్బంది ఆ కస్టమర్ తో మాట్లాడుతుండగానే మరో నలుగురు లోపలికి చొరబడ్డారు. ఆ వెంటనే తుపాకులు చూపించి ఆభరణాలన్నీ అప్పగించాలని బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ సమయంలోనే పీఎంజే జ్యువెలరీ మార్కెటింగ్ మేనేజర్ ముస్తాక్ ఎదురు తిరిగి తుపాకిని పట్టుకునే ప్రయత్నం చేయగా వెంటనే మొదటి వ్యక్తి ఆయన పై కాల్పులకు తెగబడ్డాడు. ఆ తర్వాత మరో ముగ్గురు కూడా తుపాకులతో సిబ్బందిపై కాల్పులు జరిపారు. మొత్తం నాలుగు రౌండ్ ల కాల్పులు జరిపారు.

దీంతో ముస్తాక్ తో పాటు రాజేష్, కమలహాసన్ మధుకర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే ఐదుగురు దుండగులు వారి వెంట తెచ్చుకున్న బ్యాగులలో ఆభరణాలను సర్దుకుని షోరూం నుండి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పీఎంజే జ్యువలరీ షాపులో దాదాపు నాలుగు కోట్ల వరకు ఆభరణాలు దోపిడీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.దోపిడీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు 12 టీంల వరకు ఏర్పాటు చేసి వివిధ మార్గాలలో సీసీ కెమెరాలు పరిశీలించే చర్యలు తీసుకున్నారు.

మరోవైపున కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు దుండగులు బంగారు ఆభరణాలను దోచుకున్న అనంతరం ఏ మార్గంలో వెళ్లారని విచారణ జరుపుతున్నారు.
కాగా సంఘటన జరిగిన పీఎంజే జ్యువలరీ షాప్ కు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చేరుకుని సిబ్బందితో మాట్లాడి వారి వాంగ్మూలాలను రికార్డు చేశారు. ఐదుగురు దోపిడీ దొంగల వద్ద 5 ఆయుధాలు ఉన్నాయని కానీ నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఐదుగురు దుండగలలో నలుగురు ముఖాలకు ఎలాంటి మాస్కులు ధరించలేదని, ఒక దుండగుడు ముఖానికి మాస్కు ధరించినట్లు ఆయన తెలిపారు.

దోపిడి దొంగల లో ఒకరు మాత్రమే తెలుగు మాట్లాడాలని మిగతావారు హిందీలో మాట్లాడినట్లు సిపి తెలిపారు. సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కల గాని శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





