# Tags
#Blog

మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజా రవాణా సేవలు మరింత మెరుగుపడతాయి… రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్

👁 10 Views

మంథని :

గోదావరి పుష్కరాలు–2027కు భారీ స్థాయిలో ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తాం

మహిళలకు 310 కోట్లకు పైగా జీరో టికెట్లు జారీ చేశాం

త్వరలో పెద్దపల్లి బస్ డిపో ప్రారంభం… మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని బస్టాండ్‌లో రూ.93 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు

మంథని :

మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజా రవాణా సేవలు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

మంథని మున్సిపాలిటీ పరిధిలోని మంథని బస్టాండ్‌లో రూ.93 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు ప్లాట్‌ఫారాలు, ఇతర అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష లతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణ కోసం ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించిందని, కుంభమేళాను తలపించే స్థాయిలో పుష్కరాలు నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

కోట్లాది మంది భక్తులు పుష్కరాలకు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి గ్రామం నుంచి పుష్కర క్షేత్రాలకు చేరుకునేలా ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు బస్టాండ్లను ఆధునికీకరించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

సమ్మక్క–సారలమ్మ జాతరకు ఏర్పాటు చేసిన తరహాలోనే పుష్కరాల సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామని తెలిపారు.

గత పదేళ్లలో కొత్త బస్సుల కొనుగోలు, నియామకాలు, డిపోల ఏర్పాటు వంటి అంశాలను విస్మరించారని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపట్టిందన్నారు.

కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకాలు, డిపోల ఏర్పాటు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 310 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు.

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతం రోజుకు సుమారు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగిస్తుండగా, బస్సులు దాదాపు 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయని తెలిపారు. ప్రతి గ్రామానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించే దిశగా బస్సుల ఫ్రీక్వెన్సీ పెంచుతున్నామని చెప్పారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గుర్తింపు సంఘాల ఎన్నికల అనంతరం కార్మిక ప్రతినిధులతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. కార్మికులు అపోహలు నమ్మవద్దని మంత్రి సూచించారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మంథని బస్టాండ్‌లో రెండు అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణానికి రూ.74 లక్షలు, ఇతర అభివృద్ధి పనులకు రూ.19 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం బస్టాండ్ అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేశామని, కాళేశ్వరం దేవస్థాన అభివృద్ధిలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్షగా ఉన్న పెద్దపల్లి బస్ డిపో ఏర్పాటు త్వరలోనే సాకారం కానుందని, మంథని బస్టాండ్ ఆధునికీకరణతో పాటు పెద్దపల్లి బస్ డిపోను కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో రవాణా శాఖ మంత్రి, ఇతర మంత్రులతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల అనంతరం కార్మిక ప్రతినిధులతో చర్చించి ఆర్టీసీ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ ,రీజనల్ కరీంనగర్ మేనేజర్ రాజు, డిప్యూటీ ఆర్.యం.(ఎం) మల్లేశం, డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్, ఆర్డిఓ సురేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్టీసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *