కనుమరుగు కానున్న ముంబై తెలుగువారి తొలి చిరునామా : సంగెవేని రవీంద్ర
ముంబాయి : సంగెవేని రవీంద్ర
కమాటిపురా..!_
_కడుపు నింపుకోవడానికి_
_కడుపు కింది_ _అవయవమ్మీద_
_పాలకులే రాజముద్ర వేసిన_
_ప్రేమాటిపురా..!_
ఒకప్పటి ముంబై తెలుగువారి వైభవోపేతమైన చరిత్రకు సాక్ష్యం పలికిన కమాటిపురా త్వరలోనే కనుమరుగు కానుంది. తన
ఆనవాళ్ళనే కాకుండా, తన పేరును కూడా కాలగర్భంలో పోగొట్టుకోనుంది. మొదట్లో కమాటిపురా అంటే ఇప్పటిలాగా ఒక తిట్టుకాదు…ఒక అద్వితీయమైన తెలుగువారి చరిత్ర..! ఎందరో మహానుభావుల అడ్డా..! ముంబై సామాజిక గమనాన్ని మార్చిన ఉద్యమాల నెలవు..

శతాబ్దాల క్రితం కొలాబాలోని చేపల మార్కెట్ వద్ద స్థిరపడ్డ తెలుగు ప్రజలు ఆ చేపల వాసన భరించలేక అనారోగ్యం పాలై, ప్రభుత్వ చేయూతతో స్థలాంతరం చెంది, ఉప్పు పొలాల్లోకి మారి, తెలుగు వాడలు నిర్మించుకున్న స్థలం పేరే కమాటిపురా..! ప్రణాళిక బద్దంగా, అందంగా, చూడచక్కని వీధులతో, ఏడు మందిరాలతో, సామాజిక సంస్థలతో తెలుగువారు ముచ్చటపడి నిర్మించుకున్న ఆ ప్రదేశమే “కమాటిపురా”.!
మహాత్మ జ్యోతిరావు ఫులే, డా॥బాబాసాహెబ్ అంబేడ్కర్ లాంటి మహనీయుల్ని ఆర్థికంగా, సామాజికంగా ఆదుకున్న తెలుగువారు నివసించిన ప్రదేశమే కమాటిపురా..! ఎన్నో ఉద్యమాలు జరిగిన ప్రాంతం.. ఎందరో నాయకులు, పారిశ్రామికవేత్తలు, భవన నిర్మాతలు ఉద్భవించిన చోటు.. ముంబైలో కమాటిపురాను ప్రస్తావించకుండా తెలుగువారి చరిత్ర పూర్తికాదు.
జాతి విద్వేషులు కొందరు, ఉత్తర భారతీయ ఆధిపత్య, అక్రమ వలసదారులు కొందరు తమ అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, గౌరవప్రదంగా ఉచ్చరించాల్సిన ‘కమాటిపురా’ ను అవమానప్రదమైన పదబంధంగా మార్చేశారు.. అప్పట్లో ‘కామ్’, ‘మట్టి’… ‘మట్టి కా కామ్’ చేసే మన తెలుగువాళ్ళు ఉండే ప్రాంతం గనుక అది ‘కామ్‌మట్టి పురా’ అంటే ‘కమాటిపురా’ గా అయింది.
ఆ కాలంలో విదేశీ పాలకులు బ్రిటిష్ అధికారులతో పరిపాలన సాగించేవారు. సంవత్సరాల తరబడి ముంబైలో ఉండడం వల్ల ఆ విదేశీ అధికారుల కామకోరికల్ని తీర్చేందుకు ప్రభుత్వమే కమాటిపురాను ఆనుకొని ఉన్న ప్రాంతంలో కొందరు వేశ్యల్నిఅధికారికంగా నియమించింది. అప్పట్లో ఆ రోడ్‌ను ఫాక్‌లండ్ రోడ్ / పారస్‌రోడ్ అని పిలిచేవారు. నిజానికి ఆ రోడ్ కమాటిపురాను ఆనుకొని మాత్రమే ఉంది. కానీ, రానూరానూ కమాటిపురా ప్రాంతం మొత్తాన్ని రెడ్‌లైట్ ఏరియా గా వ్యవహరించసాగారు. ముంబైలో రెడ్‌లైట్ ఏరియా అంటే కమాటిపురా అనేంతగా దుష్ప్రచారం పొందింది. కానీ, తెలుగువారు ఏర్పాటు చేసుకున్న కమాటిపుర గల్లీలు (లేన్‌లు) రెడ్ లైట్ ఏరియాలు కావు.
కమాటిపురాలో తెలుగు వారికి చెందిన సొంత భవనాలెన్నో ఉన్నాయి. రోడ్లకి తెలుగువారి పేర్లున్నాయి. మందిరాలు తెలుగువారివే..! తెలుగువారికి చెందిన అతిపెద్ద సంస్థలు, మున్నూర్‌వార్ జ్ఞాతి గంగ, అఖిల పద్మశాలి సమాజం లాంటివి ఇక్కడే ఉన్నాయి. తెలుగు పుస్తకాలయాలు, తెలుగు దుకాణాలు ఇక్కడ సర్వసాధారణం..
కాలం మారింది.. మారుతోంది.. కొన్నేండ్ల క్రితం కమాటిపురా అభివృద్ధి పేరుతో కొందరిని భవనాలు ఖాళీ చేయించి సయాన్ ప్రతీక్షా నగర్ లోని ట్రాన్సిట్ క్యాంప్‌లకు తరలించారు. దశాబ్దాల తర్వాత కూడా వారు తిరిగి కమాటిపురాకు చేరుకోలేదు. తెలుగువారి స్థానాన్ని గుజరాతీలు, మార్వాడీలు, ముస్లింలు ఆక్రమించారు.
ఇప్పుడు మళ్ళీ కమాటిపురాను పూర్తిగా కూల్చేసి టవర్‌లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
అయితే, ఇప్పుడు కేవలం కమాటిపురా గల్లీల్లోని భవనాలను కూల్చడమే కాకుండా, *కమాటిపురా* అనే పేరునే మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది….
కొన్నేండ్ల తర్వాత అక్కడ కమాటిపురా ఉండదు. ఆ ప్రాంతానికి మరో *కొత్తపేరు* రానుంది. ఏం పేరు పెడతారో ఇంకా నిర్దారణ కాకపోయినా కొత్త పేరు పెట్టాలనే నిర్ణయం మాత్రం జరిగిపోయింది.
కమాటిపురాలో తెలుగువారి సంఖ్య ఇప్పటికే బాగా తగ్గింది. అయినప్పటికీ కమాటిపురా అంటే తెలుగు కేంద్రం అనే పేరుంది. కొన్ని రోజుల తర్వాత ఇహ ఆ పేరుండదు. తెలుగువారి తొలి చిరునామా అయిన కమాటిపురా తన రూపాన్నే కాదు.. పేరును కూడా మార్చుకోబోతుంది. పరిణామ క్రమంలో జరగబోయే ఈ అభివృద్ధికి సంతోషించాలో, తెలుగువారి మూలాలు పెకిలిపోతున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి..!
వ్యవస్థలన్నీ మార్కెటింగ్ ఆధారంగా కొనసాగున్న ప్రస్తుత తరుణంలో *కమాటిపురా* అనే పేరుకోసం ఉద్యమించే అవకాశాలు కూడా లేవు. కోట్ల రూపాయలు పెట్టి కట్టే టవర్‌లను కమాటిపురా పేరుతో అమ్ముకోవడం వ్యవస్థలకు సాధ్యం కాదు. అందుకే ఈ పేరు మార్పు సంకల్పం.
కానీ, తెలుగు అభిమానులకు మాత్రం శరాఘాతం.. తప్పదు.. భరించాల్సిందే..!!

Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





