# Tags
#తెలంగాణ

కొండగట్టు అంజన్న పెద్ద జయంతి -విశేషాలు

👁 29 Views

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో పెద్ద జయంతి (హనుమాన్ జన్మదినం) అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద పండుగ ఈ రోజు.

– సిరిసిల్ల శ్రీనివాస్, ఎడిటర్, తెలంగాణ రిపోర్టర్ 

https://youtube.com/live/N8a9RqTsZD0?feature=share

కొండగట్టు అంజన్న శంఖు చక్ర గదాధరుడై, నృసింహ ముఖంతో (వెనుక భాగంలో) దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. “కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న”గా భక్తుల నమ్మకం.

సాధారణంగా చైత్ర పూర్ణిమ నాడు జరిగేది హనుమాన్ జయంతి అయితే, దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణలో వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ పెద్ద జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ. కొండగట్టు అంజన్నకు ఈ సమయం చాలా ప్రీతిపాత్రమైనదిగా భక్తులు భావిస్తారు. కొండగట్టు అంజన్నా,  కోటి కోటి దండాలన్నా…. అంటూ,  జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో అంజన్న గుట్ట ప్రాంతమంతా మార్మోగిపోతుంది. 

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవ విశేషాలలో ప్రధానంగా….

* తనకు అత్యంత ప్రీతీపాత్రుడైన భక్తుడు హనుమంతుడి జన్మదినానికి కానుకగా  శ్రీ సీతారామచంద్రులవారు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి శేష వస్త్రాలు, అక్షింతలు కొండగట్టుకు పంపించడం ఒక గొప్ప సాంప్రదాయం మనకు ఇక్కడ కనిపిస్తుంది. 

• హనుమాన్ దీక్ష విరమణ: 11, 21, లేదా 41 రోజుల పాటు హనుమాన్ దీక్ష చేపట్టిన వేలాది మంది భక్తులు ఈ పెద్ద జయంతి రోజున కొండగట్టుకు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని తమ దీక్షలను విరమిస్తారు.

• ఈ పర్వదినం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, తమలపాకులతో పూజలు మరియు ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు.

• కేవలం తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుండి కూడా లక్షలాది మంది భక్తులు ఈ సమయంలో కొండగట్టుకు తరలివస్తారు.

• ఉత్సవాల్లో భాగంగా అంజన్న విగ్రహాన్ని రథంపై మేళతాళాలతో శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ వేడుకను చూడటానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ శోభాయాత్ర చూస్తుంటే, సాక్షాత్తు గధతో తరలివస్తున్న ప్రశాంతవదనుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు కొండగట్టు గుట్ట ప్రాంతమంతా కలియ తిరుగుతూ, భక్తులకు దర్శనమిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ సమయంలో హనుమాన్ దీక్షపరులు భక్తిభావంతో చేస్తున్న జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటుతాయి.

కొండపైన ఉండే “ధర్మగుండం”లో స్నానాలు ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.

ఇక కొండగట్టు అంజన్న ఆలయంలో ఏడాదిలో చిన్న జయంతి, పెద్ద జయంతి, ఈ రెండు ఉత్సవాలు జగిత్యాల జిల్లాలో ఒక వైపు ఆధ్యాత్మికతను పదిలపరుస్తుండగా, మరో వైపు ఎన్నో చిరు వ్యాపారుల కుటుంబాలకు జీవనోపాధినందిస్తుంది.

ఈ రెండు ఉత్సవాలకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ మరియు దేవాలయ కమిటీ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, మరియు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *