హైదరాబాద్ (జగిత్యాల జిల్లా ఎండపల్లి) :
◉ గల్ఫ్ యజమాని వదిలిపెడితేనే… సైనికుడిగా అవకాశం
◉ వీసా రద్దు, వాపస్ పంపడానికి ₹1.08 లక్షల జరిమానా
భారత సైన్యం నిర్వహిస్తున్న ‘అగ్నివీర్’ రిక్రూట్మెంట్ ర్యాలీ ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా తన కుమారుడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబి నుంచి అత్యవసరంగా స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఓ తల్లి ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు.

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన కొపర్తి అభిలాష్ జగిత్యాలలోని లైసెన్సు కలిగిన ఒక గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా టూరిస్ట్ వీసాపై ఈ నెల 8న ముంబయి నుంచి అబుదాబి కి వెళ్లారు.
అనంతరం ఈ నెల 13న అతనికి ఎంప్లాయిమెంట్ వీసా జారీ అయింది. ఇదే సమయంలో భారత సైన్యం నిర్వహిస్తున్న ‘అగ్నివీర్’ రిక్రూట్మెంట్ ర్యాలీ లో భాగంగా నిర్వహించే ఫిజికల్ స్క్రీనింగ్ (దేహదారుఢ్య పరీక్ష) కు షార్ట్‌లిస్ట్ అయినట్లు అతనికి ఈ నెల 14న ఇ-మెయిల్ అందింది.

అయితే, ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం 4,100 యూఏఈ దిర్హాములు (సుమారు ₹1.08 లక్షలు) జరిమానా చెల్లించి వీసా రద్దు చేస్తేనే భారత్‌కు పంపిస్తామని షరతు విధించిందని, రిక్రూటింగ్ ఏజెంట్ కూడా అదే విషయాన్ని చెబుతున్నాడని అభిలాష్ తల్లి సుమలత వాపోయారు. తన కుమారుడు అగ్నివీర్ ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని అతడిని అత్యవసరంగా అబుదాబి నుంచి స్వదేశానికి రప్పించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ బేగంపేట ప్రజా భవన్లో నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ లో వినతిపత్రం సమర్పించారు.

తన కుమారుడు భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే చిరకాల స్వప్నం నెరవేరేలా సహాయం చేయాలని సుమలత, ‘సీఎం ప్రజావాణి’ స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన, పేద కుటుంబానికి చెందిన యువకుడికి తగిన సహాయం అందించి అత్యవసరంగా స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జీఏడీ)కి లేఖ రాశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి బాధిత కుటుంబానికి మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ హెల్ప్‌డెస్క్ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్ గంగుల మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





