# Tags
#Culture #జగిత్యాల #తెలంగాణ

శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబురాలు

👁 18 Views

జగిత్యాల :

స్థానిక శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని WEC & NSS ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య. పి. ఇందిరాదేవి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజించి, బతుకమ్మ పాటలు పాడుతూ సంబురాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి పట్టణ మున్సిపల్ చైర్మన్ సామిండ్ల వాణి ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, పూల వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే గొప్ప సాంస్కృతిక పండుగ అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడంలో విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాలని అన్నారు.

కౌన్సిలర్ ఏనుగుల లావణ్య రాజేందర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉందని, మహిళలు, యువత సంప్రదాయాలను కొనసాగిస్తూ ఉత్సాహంగా బతుకమ్మ సంబురాల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య. పి. ఇందిరాదేవి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, భాష, సంప్రదాయాల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. బతుకమ్మ పండుగ ప్రకృతితో మానవ జీవనానికి ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే ప్రత్యేకమైన పండుగ అని అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకువచ్చి, సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు వేస్తూ సందడి చేశారు. కళాశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. పి. రాజు, డా. జి.వి.ఆర్. సాయి మధుకర్, NSS PO కె. శ్రీనివాస్, కె. సురేందర్ డా. మహేశ్, డా. అనిల్, ప్రమోద్, శ్రీనివాస్, రాహుల్ WEC సభ్యులు సుప్రియ, కవిత, రజిత, లత, నీరజ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.