# Tags
#Events #జగిత్యాల #తెలంగాణ

పోక్సోచట్టం, 2012 పై న్యాయ అవగాహన కార్యక్రమం

👁 20 Views

జగిత్యాల :

బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం, 2012 (POCSO Act) పై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు పోక్సో చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు, బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించడానికి తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు, బాలల హక్కులు మరియు భద్రత యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు.

రెండవ అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శ్రీమతి నిక్షిష విద్యార్థినులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, వ్యక్తిగత భద్రత, తమకు ఎదురయ్యే అనుచిత ప్రవర్తనను భయం లేకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. తమను తాము మరియు ఇతర బాలలను రక్షించుకోవడం, వ్యక్తిగత హద్దులను గౌరవించడం, బాలలపై జరిగే వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవడం, ఏదైనా అసురక్షిత పరిస్థితి ఎదురైతే నమ్మకమైన పెద్దలకు తెలియజేయడం, ప్రతి బాలికకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేయడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేయించారు.

బాలల రక్షణ చట్టాలపై అవగాహన పెంపొందించడం, వ్యక్తిగత భద్రతపై విద్యార్థినులకు చైతన్యం కల్పించడం, బాలలపై జరిగే నేరాలను నివారించడంలో విద్యాసంస్థలు మరియు సమాజం పాత్రను తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని వివరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.