24 గంటల్లోనే చైన్ స్నాచింగ్ కేసును ఛేదించి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందనలు
జగిత్యాల జిల్లా …
– వేగవంతమైన దర్యాప్తు, సమన్వయంతో 24 గంటల్లోనే కేసును ఛేదించిన మల్యాల సీఐ రాజ్ కుమార్, కొడిమ్యాల ఎస్ఐ నరేష్, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లకు బహుమతులు అందజేత

జగిత్యాల జిల్లా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారైన ముగ్గురు నిందితులను సంఘటన జరిగిన కేవలం 24 గంటల్లోనే గుర్తించి అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మల్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, కొడిమ్యాల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నరేష్, ఐడీ పార్టీ కానిస్టేబులు రాజేందర్, అంజనేయులు, విక్రాంత్ లను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి, వారి విధి నిర్వహణను ప్రశంసిస్తూ బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. నేరం జరిగిన వెంటనే స్పందించి, ఎలాంటి ఆలస్యం లేకుండా దర్యాప్తు ప్రారంభించడం, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ చేయడం, పోలీసు బృందాల మధ్య సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించడం సాధ్యమైందని తెలిపారు.

మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారైన ముగ్గురు నిందితులను వేగంగా గుర్తించి అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.పోలీసు శాఖలో విధి నిర్వహణలో వేగం, సమయస్ఫూర్తి, అంకితభావం, సమన్వయం ఎంతో ముఖ్యమని ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలు, చైన్ స్నాచింగ్ వంటి ఆస్తి సంబంధిత నేరాల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉంటూ బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.నేరం జరిగిన వెంటనే స్పందించి నిందితులను త్వరితగతిన పట్టుకోవడం ద్వారా బాధితుల్లో పోలీసులపై నమ్మకం మరింత పెరుగుతుందని, నేరస్థుల్లో చట్టంపై భయం ఏర్పడుతుందని తెలిపారు.

ఇలాంటి ప్రతిభావంతమైన విధి నిర్వహణను గుర్తించి పోలీసు సిబ్బందిని ప్రోత్సహించడం ద్వారా ఇతర సిబ్బందిలోనూ మరింత ఉత్సాహం, బాధ్యత, అంకితభావం పెరుగుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన పనితీరును కొనసాగిస్తూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజల భద్రత కోసం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, నేరాల నియంత్రణలో ప్రతిభ కనబరిచే పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





