వైద్య విద్య అభివృద్ధికి తోడ్పడదాం అంటూ, శరీర దాన అంగీకార పత్రాన్ని కళాశాల ప్రిన్సిపాల్ కు అందజేసిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు బొంకూరి గంగారావు
మానవసేవకు మార్గం… శరీరదానం!
వైద్య విద్య అభివృద్ధికి తోడ్పడదాం అంటూ, అంగీకార పత్రాన్ని కళాశాల ప్రిన్సిపాల్ కు అందజేసిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు బొంకూరి గంగారావు

మనిషి జన్మించడం సహజం… మరణించడం సహజం… కానీ మరణానంతరం కూడా తన దేహం ద్వారా సమాజానికి ఉపయోగపడే అవకాశం లభించడం గొప్ప విషయం. అలాంటి మానవతా విలువలతో కూడిన సేవే శరీరదానం (Body Donation).
మనిషి మరణించిన తర్వాత తన భౌతిక దేహాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనం, వైద్య బోధన, శాస్త్రీయ పరిశోధనల కోసం మెడికల్ కాలేజీకి స్వచ్ఛందంగా అందించడాన్ని శరీరదానం అంటారు. ఇది వైద్య విద్య అభివృద్ధికి తోడ్పడటంతో పాటు, భవిష్యత్తులో వైద్యులుగా ఎదిగే విద్యార్థులకు మానవ శరీర నిర్మాణంపై ప్రత్యక్ష అవగాహన కల్పిస్తుంది.
శరీరదానం ఎందుకు అవసరం?

వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు మానవ శరీరంలోని వివిధ అవయవాలు, కండరాలు, నరాలు, రక్తనాళాలు, వాటి నిర్మాణం గురించి లోతైన అవగాహన అవసరం. పుస్తకాలు, చిత్రాలు, డిజిటల్ నమూనాలతో పాటు, చట్టబద్ధంగా దానం చేసిన మానవ దేహాలపై అధ్యయనం చేయడం వైద్య విద్యలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.
శరీరదానం ద్వారా విద్యార్థులు మానవ శరీర నిర్మాణాన్ని మరింత సమగ్రంగా అర్థం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. తద్వారా భవిష్యత్తులో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే వైద్యుల శిక్షణకు దాతలు పరోక్షంగా తోడ్పడతారు.
శరీరదానం మాత్రం ప్రధానంగా వైద్య విద్య, శరీర నిర్మాణ అధ్యయనం, పరిశోధనల కోసం ఉపయోగపడుతుంది.
ఈ నేపథ్యంలో….. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు బొంకూరి గంగారావు తన మరణానంతరం దేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించడానికాను శనివారం జగిత్యాల వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుభాష్ కు మరియు అనాటమీ విభాగానికి తన అంగీకార పత్రాన్ని అందజేసి, శరీరదాతగా వైద్య కళాశాలలో పేరు నమోదు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో శరీర దానం కోసం అంగీకారం తెలిపిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు బొంకూరి గంగారావుతో పాటుగా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. సుభాష్, జగిత్యాల రోటరీ క్లబ్ పూర్వ అసిస్టెంట్ గవర్నర్, జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్, క్రిటికల్ కేర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డా, శ్రీపతి, అనాటమీ విభాగం వైద్యులు డా. శ్రీనివాస్ ఉన్నారు.
శరీరదాన నిర్ణయం గురించి గత కొద్దిరోజులనుండి ఆలోచించి, తన కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేయడం జరిగిందని ఈ సందర్భంగా గంగారావు వివరించారు.
శరీర దానం ద్వారా మానవ శరీర నిర్మాణాన్ని మరింత సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వైద్య విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో, తాను నిర్ణయించుకుని అంగీకార పత్రం అందజేయడం జరిగిందని, శరీర దానంపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, వైద్య విజ్ఞానంకు తోడ్పాటునందించాలని గంగారావు కోరారు.

కాగా, శరీర దానం అంగీకార పత్రం అందజేసినందుకుగాను వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. సుభాష్… దానపత్రం అందజేసిన బొంకూరి గంగారావుకు, సహకరించిన జగిత్యాల రోటరీ క్లబ్ పూర్వ అసిస్టెంట్ గవర్నర్, జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.
శరీరదానం అనేది వ్యక్తి స్వచ్ఛంద నిర్ణయం. అయితే, మరణం సంభవించినప్పుడు శరీరాన్ని సమయానికి సంబంధిత మెడికల్ కాలేజీకి అందించేందుకు కుటుంబ సభ్యులకు ముందస్తు సమాచారం ఉండటం చాలా ముఖ్యమనీ, వారి సహకారం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. సుభాష్ వివరించారు.
శరీరదానం గురించి సమాజంలో ఇంకా అనేక సందేహాలు, అపోహలు ఉన్నాయనీ…. సంప్రదాయాలు, కుటుంబ విశ్వాసాలు, అంత్యక్రియలపై ఆందోళనల వల్ల కొందరు వెనుకడుగు వేస్తారనీ, అందువల్ల వైద్య నిపుణులు, సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సరైన సమాచారాన్ని అందించాలని కోరారు.
శరీరదానం చేయాలా వద్దా అనేది ప్రతి వ్యక్తి స్వచ్ఛందంగా తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు.. ఎవరిపైనా ఒత్తిడి చేయకుండా, పూర్తి సమాచారం అందించి, వ్యక్తిగత విశ్వాసాలను గౌరవిస్తూ అవగాహన కల్పించాలని డా. సుభాష్ సూచించారు.
పాఠశాలలు, కళాశాలలు, సేవా సంస్థలు, రోటరీ క్లబ్ వంటి మానవతా సంస్థలు శరీరదానం, అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వైద్యులు, అనాటమీ విభాగ నిపుణులు ప్రజల సందేహాలకు సమాధానాలు ఇవ్వాలనీ, సామాజిక మాధ్యమాల ద్వారా శాస్త్రీయమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.
శరీరదానం గురించి అవగాహన పెరిగినప్పుడు, వైద్య విద్యకు అవసరమైన దాతృత్వ సహకారం అందించే అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు.
మనిషి సంపాదించిన ఆస్తులు, హోదాలు, కీర్తి అన్నీ జీవితంతో ముడిపడి ఉంటాయని సిరిసిల్ల శ్రీనివాస్ అన్నారు.. కానీ సమాజానికి సేవ చేయాలనే సంకల్పం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందనీ, మరణానంతరం కూడా వైద్య విద్య అభివృద్ధికి తోడ్పడాలనే రిటైర్డ్ ఉపాధ్యాయుడు బొంకూరి గంగారావు ఆలోచన గొప్ప మానవతా దృక్పథం అన్నారు.
శరీరదానం, అవయవదానం రెండూ మానవసేవకు సంబంధించినవే అయినప్పటికీ, వాటి ఉద్దేశాలు వేర్వేరన్నారు.
అవయవదానం ద్వారా మూత్రపిండాలు, కాలేయంలోని భాగం వంటి అనుకూలమైన అవయవాలను అవసరమైన రోగులకు మార్పిడి చేయవచ్చు… కళ్ల దానం ద్వారా అర్హులైన వారికి చూపు కల్పించే అవకాశం ఉంటుంది.
శరీరదానం మాత్రం ప్రధానంగా వైద్య విద్య, శరీర నిర్మాణ అధ్యయనం, పరిశోధనల కోసం ఉపయోగపడుతుందని వివరించారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





