నషాముక్త్ తెలంగాణలో రెడ్‌క్రాస్ క్రియాశీలకపాత్ర పోషించాలి: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- వికసిత్ భారత్ – 2047లో యువత భాగస్వామ్యం కీలకం
- 68 వేల మంది కొత్త సభ్యుల చేరికపై అభినందన.. మూడు కీలక కార్యక్రమాలకు గవర్నర్ పిలుపు
హైదరాబాద్, నవంబర్ 14 ,2026 :

మాదకద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ క్రియాశీలక పాత్ర పోషించాలని గవర్నర్ , ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమైన వికసిత్ భారత్–2047 సాధనలో యువత భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.

లోక్‌భవన్‌లో శనివారం రెడ్‌క్రాస్ సొసైటీకి నూతనంగా ఎన్నికైన 29 జిల్లాల చైర్మన్లు, చైర్పర్సన్లు, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులతో గవర్నర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సంస్థ చేపట్టాల్సిన మూడు ప్రధాన కార్యక్రమాలపై గవర్నర్ దిశానిర్దేశం చేశారు.
68 వేల మంది చేరిక అభినందనీయం
కేవలం మూడున్నర నెలల్లో 68 వేల మంది కొత్త సభ్యులను చేర్చుకోవడం అభినందనీయమని గవర్నర్ అన్నారు.

రాష్ట్ర శాఖ ఏర్పాటైనప్పటి నుంచి ఉన్న మొత్తం సభ్యత్వం 60 వేలుగా ఉండగా, ఒక్క ప్రత్యేక డ్రైవ్‌లోనే మరో 68 వేల మందిని చేర్చుకోవడం విశేషమన్నారు. ఈ కృషికి నాయకత్వం వహించిన రెడ్‌క్రాస్ రాష్ట్ర శాఖ చైర్మన్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్‌తో పాటు జిల్లా శాఖల ప్రతినిధులను అభినందించారు.
ఇదే స్పూర్తి తో కొత్త కార్యవర్గం మరింత మందిని కొత్తగా సభ్యులుగా చేర్చేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు .

మూడు కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ సభ్యత్వాన్ని పెంచేందుకు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులను పెద్ద సంఖ్యలో చేర్చుకోవాలని, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రచారం నిర్వహించాలని తెలిపారు.

అదే సమయంలో నషా ముక్త్ అభియాన్‌లో భాగంగా ర్యాలీలు, ప్రతిజ్ఞలు, పోటీల ద్వారా మాదకద్రవ్యాలపై యువతకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈగల్ ఫోర్స్, ఇతర స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవాలని కోరారు.విపత్తుల నివారణ, నిర్వహణకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే నమోదైన 2,078 మంది ఆపద మిత్ర వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జనవరి 12న వివేకానంద అవార్డులు :
సేవా కార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యాసంస్థలకు రెడ్‌క్రాస్–లోక్‌భవన్ వివేకానంద యూత్ అవార్డులు అందజేయనున్నట్లు గవర్నర్ ప్రకటించారు.
ప్రతి జిల్లా నుంచి రెండు ఉన్నత పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాల, ఒక డిగ్రీ, ఇంజినీరింగ్ లేదా మెడికల్ కళాశాలను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాది జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ అవార్డులు ప్రదానం చేస్తామన్నారు.

కుటుంబ వ్యవస్థే సమాజానికి పునాది:
కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే సమాజం బలోపేతమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. మద్యం, మాదకద్రవ్యాల వినియోగం కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థులకు వీటి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు. రెడ్‌క్రాస్ కేవలం సేవా సంస్థ మాత్రమే కాదని, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే ఉద్యమమని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రమాణ స్వీకారం:

అంతకుముందు గవర్నర్ శివప్రతాప్ శుక్ల సమక్షంలో రెడ్‌క్రాస్ సొసైటీకి కొత్తగా ఎన్నికైన రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులతో రెడ్‌క్రాస్ రాష్ట్ర శాఖ చైర్మన్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ ప్రమాణ స్వీకారం చేయించారు .

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ స్టేట్ లలో రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లోక్ భవన్ వేదికగా ప్రమాణం చేయడం ఇదే మొదటిసారి.
అనంతరం రెడ్ క్రాస్ ప్రచార పోస్టర్ లను గవర్నర్ ఆవిష్కరించారు .
కార్యరకమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి సర్ కోమండూర్ శశికిరణ్ , General Secretary & CEO, IRCS Telangana State Branch ఎ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





