జిల్లా కలెక్టరేట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమం : పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ప్రసూనాంబ
దేశంలో విద్యాభివృద్ధికి పునాదులు వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ : జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ
జగిత్యాల, నవంబర్ 11:
స్వతంత్ర భారతదేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసి, గుణాత్మక విద్యకు పునాదులు వేసిన తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ పేర్కొన్నారు.

బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ మాట్లాడుతూ, ఆయన జన్మదినమైన నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారని అన్నారు.

స్వాతంత్ర్యం అనంతరం తొలి కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆజాద్ సుమారు 11 సంవత్సరాల పాటు దేశ విద్యారంగ అభివృద్ధికి కృషి చేశారు. సమగ్ర విద్యావిధాన రూపకల్పనకు పునాదులు వేయడంతో పాటు ప్రాథమిక, ఉన్నత, సెకండరీ విద్యాభివృద్ధికి ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేశారు.

విద్యా రంగంలో ఉన్నత ప్రమాణాల సాధనకు యూజీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుకు కృషి చేసి, సాంకేతిక విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. భారతీయ సంస్కృతి, కళలు, సంగీతం, సాహిత్య పరిరక్షణకు విశేష సేవలందించారు. విద్య ద్వారానే వ్యక్తి, సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయని చాటిచెప్పిన ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నాణ్యమైన విద్యను అందరికీ చేరువ చేయాలని ఈ సందర్భంగా స్మరించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ మరియు జిల్లా రెవెన్యూ అధికారి కె. వై ప్రసాద్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో కిషన్, కలెక్టరేట్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





