# Tags
#Culture #Events #జగిత్యాల #తెలంగాణ

చరిత్ర, ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యాల సమ్మేళనంగా జగిత్యాల జిల్లా….

👁 20 Views

జగిత్యాల పర్యాటక వైభవం – ప్రకృతిని కాపాడుతూ ప్రయాణిద్దాం

తెలంగాణ పర్యాటక వైభవంలో జగిత్యాల జిల్లా ప్రత్యేక స్థానం

*ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
జగిత్యాల

కొత్త ప్రాంతాలను చూడాలనే ఆసక్తి, అక్కడి ప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి చేసే ప్రయాణాలు మధురానుభూతులను మిగిల్చడంతో పాటు, రోజు వారి జీవన ప్రయాణంలో ఒత్తిడినితగ్గిస్తూ , మన పరిజ్ఞానాన్ని విస్తరింపజేస్తాయి. విభిన్న ప్రాంతాల సంస్కృతులను పరిచయం చేస్తాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తాయి. చరిత్రను తెలుసుకునే మార్గాన్ని చూపుతాయి.

అయితే పర్యాటకం తో పాటు బాధ్యత కూడా ఉండాలి. మన ప్రయాణం వల్ల ప్రకృతికి, చారిత్రక కట్టడాలకు, స్థానిక ప్రజల జీవన విధానానికి ఎలాంటి నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పర్యాటకుడి పైనా ఉంది. పర్యావరణహిత, బాధ్యతాయుత పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా భావితరాలకు మన సహజ, చారిత్రక, సాంస్కృతిక సంపదను అందించవచ్చు.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక వైభవాన్ని గుర్తుచేసుకోవడం సముచితం. తెలంగాణలో చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలకు కొదవలేదు. వాటిలో జగిత్యాల జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

చరిత్ర, ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం, గోదావరి నదీ సంస్కృతి, గ్రామీణ జీవన విధానం కలగలిసిన ప్రాంతంగా జగిత్యాల జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. కొండలు, నదులు, దేవాలయాలు, కోటలు, పురాతన కట్టడాలు, పచ్చని పంట పొలాలు, గ్రామీణ వాతావరణం పర్యాటకులను ఆకట్టుకునే విశేష సంపదగా నిలుస్తున్నాయి.

*కొండగట్టు – జగిత్యాల పర్యాటకానికి మణిహారం*

మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిసరాల్లోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రం జిల్లాలోనే కాకుండా తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది. కొండల మధ్య ప్రకృతి ఒడిలో వెలసిన ఈ క్షేత్రానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.

కొండగట్టు ప్రత్యేకత కేవలం ఆలయానికే పరిమితం కాదు. ఆలయ పరిసరాల్లోని కొండలు, పచ్చని చెట్లు, వర్షాకాలంలో కనిపించే ప్రకృతి సోయగాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించగలిగే ప్రాంతంగా కొండగట్టు ప్రత్యేక గుర్తింపు పొందింది.

పర్యాటకుల రాక పెరుగుతున్న నేపథ్యంలో కొండగట్టు పరిసరాల్లో పరిశుభ్రత, పచ్చదనం, ప్లాస్టిక్ నియంత్రణ, వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

*ధర్మపురి – గోదావరి తీరాన ఆధ్యాత్మిక వైభవం*

గోదావరి నది తీరంలో వెలసిన ధర్మపురి జగిత్యాల జిల్లాలో మరో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

ఆలయ దర్శనంతో పాటు గోదావరి నదీ తీరంలోని ప్రకృతి అందాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. నదీ తీర ప్రాంతం భక్తులకు, పర్యాటకులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మికత, నదీ సంస్కృతి, ప్రకృతి సౌందర్యం కలిసిన ప్రాంతంగా ధర్మపురి ప్రత్యేకతను సంతరించుకుంది.

గోదావరి నది జిల్లాలోని పలు ప్రాంతాలకు సహజసిద్ధమైన అందాన్ని అందిస్తోంది. నదితో ముడిపడిన స్థానిక సంస్కృతి, పండుగలు, సంప్రదాయాలు కూడా పర్యాటకులకు ఆసక్తిని కలిగిస్తాయి.

*జగిత్యాల కోట – చరిత్రకు సజీవ సాక్ష్యం*

జగిత్యాల పట్టణంలోని చారిత్రక కోట జిల్లాకు గర్వకారణమైన వారసత్వ కట్టడాల్లో ఒకటి. నక్షత్రాకార నిర్మాణ శైలి, కోట చుట్టూ ఉన్న చారిత్రక నేపథ్యం పర్యాటకులను ఆకర్షించే అంశాలు.

చారిత్రక కట్టడాలు కేవలం రాళ్లు, గోడలు మాత్రమే కావు. అవి గత తరాల జీవన విధానం, నిర్మాణ నైపుణ్యం, పాలనా చరిత్రకు సజీవ సాక్ష్యాలు. అందువల్ల జగిత్యాల కోట వంటి వారసత్వ కట్టడాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత.

కొండగట్టు, ధర్మపురి, జగిత్యాల కోటలను అనుసంధానిస్తూ సమగ్ర పర్యాటక మార్గాలను అభివృద్ధి చేస్తే జిల్లాలో పర్యాటక అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉంది.

*కోటిలింగాల – శాతవాహన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం*

జగిత్యాల జిల్లా చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో కోటిలింగాల ఒకటి. గోదావరి, పెద్దవాగు సంగమ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రాచీన చరిత్రలో విశిష్ట స్థానం ఉంది.

ధర్మపురికి సుమారు 19 కిలోమీటర్లు, కరీంనగర్‌ కు సుమారు 55 కిలోమీటర్లు, హైదరాబాద్‌ కు సుమారు 218 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటిలింగాల ప్రస్తుతం గ్రామీణ వాతావరణంలో ఉన్నప్పటికీ, గతంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన చారిత్రక ప్రాంతంగా వెలుగొందింది.

శాతవాహనుల కాలానికి సంబంధించిన నాణేలు, పురావస్తు అవశేషాలు ఈ ప్రాంత ప్రాచీనతను చాటుతున్నాయి. శాతవాహనుల తొలి రాజధానిగా కోటిలింగాల కు చారిత్రక ప్రాధాన్యం ఉంది. పురావస్తు తవ్వకాలలో లభించిన నాణేలు, మట్టి పాత్రలు, ఇతర అవశేషాలు అప్పటి నాగరికత, వాణిజ్య కార్యకలాపాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి.

గోదావరి తీరంలో ఉన్న కోటిలింగాల చారిత్రక ప్రాధాన్యం తో పాటు ప్రకృతి సౌందర్యానికి కూడా నిలయంగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాలు, గోదావరి బ్యాక్‌వాటర్ ప్రాంతం పర్యాటక అభివృద్ధికి అవకాశాలను కల్పిస్తున్నాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోటింగ్ వంటి సదుపాయాలు కూడా పర్యాటక ఆకర్షణను పెంచుతున్నాయి.

కోటిలింగాల ను చరిత్ర, పురావస్తు, ఆధ్యాత్మికత, ప్రకృతి పర్యాటకాల ను కలిపిన ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది.

*వాల్గొండ – గోదావరి తీరాన త్రికూటాలయ వైభవం*

జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గోదావరి నదీ తీరాన ఉన్న మరో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశం. గోదావరి ఒడ్డున కొండ ప్రాంతం వైపు వాలుగా ఉన్న భౌగోళిక స్వరూపం కారణంగా ఈ ప్రాంతానికి వాల్గొండ అనే పేరు ఏర్పడినట్లు స్థానిక చరిత్రలో పేర్కొంటారు.

గోదావరి తీరంలోని గుట్టపై ఉన్న త్రికూటాలయం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. చాళుక్యుల కళా రీతులను ప్రతిబింబించే నిర్మాణ శైలి ఈ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యాన్ని కల్పిస్తోంది. రాయికల్ ప్రాంతంలోని త్రికూటాలయ నిర్మాణ శైలిని పోలిన శిల్పకళా లక్షణాలు ఇక్కడ కనిపిస్తాయి.

వాల్గొండ చుట్టూ పచ్చని పంట పొలాలు, గుట్టలు, గోదావరి నదీ ప్రవాహం, ప్రకృతి సిద్ధమైన అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. పక్షుల సందడి, పంట పొలాల మధ్య గ్రామీణ వాతావరణం ఈ ప్రాంతానికి మరింత రమణీయతను అందిస్తున్నాయి.

ప్రకృతి అందాలతో పాటు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న వాల్గొండ ను పర్యాటక పటంలో మరింతగా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.

*రాయికల్, మెట్‌పల్లి ప్రాంతాలు – గ్రామీణ పర్యాటకానికి అవకాశాలు

జిల్లాలోని రాయికల్, మెట్‌పల్లి ప్రాంతాలు గ్రామీణ జీవన విధానం, వ్యవసాయ సంస్కృతి, స్థానిక ఆహార సంప్రదాయాలు, జానపద కళలను పరిచయం చేసే అవకాశాలను కలిగి ఉన్నాయి.

గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థానిక ప్రజలకు అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. స్థానికంగా తయారయ్యే ఆహార పదార్థాలు, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ లభించవచ్చు. స్థానిక యువతకు టూరిస్ట్ గైడ్లు, హోమ్‌స్టేలు, రవాణా, ఆతిథ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.

*గోదావరి – జగిత్యాల పర్యాటకానికి సహజ వరం

గోదావరి నది జగిత్యాల జిల్లాకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. గోదావరి తీర ప్రాంతాల్లోని పచ్చని పొలాలు, గుట్టలు, నదీ ప్రవాహం, గ్రామీణ వాతావరణం పర్యాటకులను ఆకట్టుకునే సహజ వనరులు.

కోటిలింగాల, వాల్గొండ, ధర్మపురి తదితర గోదావరి పరివాహక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ పర్యావరణహిత పర్యాటక మార్గాలను అభివృద్ధి చేయవచ్చు. అయితే నదీ పర్యాటక అభివృద్ధి పేరుతో గోదావరి నదిని, నదీ పరిసరాలను కలుషితం చేయకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

*పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రతే ప్రధాన బాధ్యత

పర్యాటక ప్రాంతాల అందాన్ని కాపాడటంలో పరిశుభ్రత కీలకం. కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల, వాల్గొండ తదితర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలి.

ప్రతి పర్యాటకుడు చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోని చెత్త కుండీల్లోనే వేయాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను తగ్గించాలి. పునర్వినియోగ సీసాలు, సంచులను వినియోగించాలి. గోదావరి నదిలో చెత్త, ప్లాస్టిక్, పూజా సామగ్రిని పడవేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.

*స్థానికులకు ప్రయోజనం కలిగేలా పర్యాటక అభివృద్ధి*

పర్యాటకం అభివృద్ధి చెందితే దాని ప్రయోజనం స్థానిక ప్రజలకు చేరాలి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలి. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ లభించాలి. స్థానిక కళాకారులు, హస్తకళాకారులను ప్రోత్సహించాలి.

స్థానిక ఆహార పదార్థాలు, జానపద కళలు, గ్రామీణ జీవన విధానాన్ని పర్యాటకులకు పరిచయం చేయడం ద్వారా జగిత్యాల ప్రత్యేకతను మరింతగా చాటవచ్చు.

*విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంపొందించాలి

పర్యాటక ప్రాంతాల పరిరక్షణపై విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే అవగాహన కల్పించాలి. స్థానిక చరిత్ర, వారసత్వ కట్టడాలు, ప్రకృతి వనరుల ప్రాధాన్యాన్ని వారికి వివరించాలి.

కొండగట్టు , ధర్మపురి ఆలయాల చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టత, సాంస్కృతిక ప్రాధాన్యం మరియు జగిత్యాల కోట ప్రత్యేకత, కోటిలింగాల శాతవాహన చరిత్ర, వాల్గొండ త్రికూటాలయ విశిష్టతలను విద్యార్థులకు పరిచయం చేయాలి. పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రత, మొక్కల సంరక్షణ కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేయాలి.

*అభివృద్ధి పేరుతో ప్రకృతికి నష్టం చేయొద్దు

పర్యాటక రంగం అభివృద్ధి చెందాల్సిందే. అయితే అభివృద్ధి పేరుతో ప్రకృతిని దెబ్బతీయకూడదు. పర్యాటక ప్రాంతాలను అనవసరమైన కాంక్రీట్ నిర్మాణాలతో నింపకుండా, స్థానిక పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి.

కొండలు, నదులు, చెట్లు, పక్షులు, వన్యప్రాణులు, చారిత్రక కట్టడాలు పర్యాటకానికి మూలసంపద. వాటిని సంరక్షిస్తూ అభివృద్ధి చేయడమే సుస్థిర పర్యాటకానికి నిజమైన అర్థం.

*జగిత్యాల పర్యాటక వైభవాన్ని ప్రపంచానికి చాటుదాం

కొండగట్టు ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిస్తే.. ధర్మపురి గోదావరి తీర ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. జగిత్యాల కోట చారిత్రక వారసత్వానికి గుర్తుగా నిలుస్తోంది. కోటిలింగాల శాతవాహనుల ప్రాచీన చరిత్రను గుర్తుచేస్తోంది. వాల్గొండ చాళుక్యుల కాలపు త్రికూటాలయ నిర్మాణ కళకు, గోదావరి తీర ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

ఈ వైవిధ్యాన్ని సమర్థంగా ప్రచారం చేస్తూ, పర్యాటక ప్రాంతాలను పరస్పరం అనుసంధానం చేస్తే జగిత్యాల జిల్లాలో పర్యాటక రంగానికి మరింత విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. అదే సమయంలో స్థానికులకు ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరగడంతో జిల్లా ఆర్థికాభివృద్ధికి కూడా పర్యాటకం దోహదపడుతుంది.

*బాధ్యతాయుత పర్యాటకమే భవిష్యత్ మార్గం

పర్యాటకం మన ఆనందం కోసం మాత్రమే కాదు. మన చరిత్రను తెలుసుకోవడానికి, సంస్కృతిని అర్థం చేసుకోవడానికి, ప్రకృతిని ఆస్వాదించడానికి ఒక గొప్ప అవకాశం.

కొండగట్టుకు వెళ్తే కొండల పరిశుభ్రతను కాపాడాలి.
ధర్మపురికి వెళ్తే గోదావరిని కలుషితం చేయకూడదు.
జగిత్యాల కోటను సందర్శిస్తే చారిత్రక కట్టడాన్ని గౌరవించాలి.
కోటిలింగాల కు వెళ్తే పురావస్తు అవశేషాలను సంరక్షించాలి.
వాల్గొండను సందర్శిస్తే ఆలయ వైభవంతో పాటు ప్రకృతి సౌందర్యాన్ని కాపాడాలి.
గ్రామీణ ప్రాంతాలను సందర్శిస్తే స్థానిక ప్రజల జీవన విధానాన్ని గౌరవించాలి.

ప్రకృతిని ఆస్వాదిద్దాం.. కానీ ప్రకృతిని నాశనం చేయకూడదు.
చరిత్రను తెలుసుకుందాం.. కానీ చారిత్రక కట్టడాలను దెబ్బతీయకూడదు.
స్థానిక సంస్కృతిని తెలుసుకుందాం.. కానీ స్థానికుల మనోభావాలను గౌరవించాలి.

జగిత్యాల పర్యాటక సంపదను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంత ఉందో, దానిని భావితరాల కోసం సంరక్షించాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది.

పర్యాటకం స్థానికులకు ఉపాధి ఇవ్వాలి.
పర్యాటకం ప్రకృతిని రక్షించాలి.
పర్యాటకం చరిత్రను కాపాడాలి.
పర్యాటకం భావితరాలకు సంపదను అందించాలి.

“ప్రకృతిని కాపాడుతూ.. పర్యావరణ సమతుల్యతను పరిరక్షిస్తూ.. భావి తరాలకు మన జగిత్యాల సహజ, చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని అందించడం మనందరి బాధ్యత. జగిత్యాల జిల్లా పర్యాటక వైభవాన్ని ప్రపంచానికి చాటుతూ, ప్రకృతితో మమేకమైన బాధ్యతాయుత పర్యాటకాన్ని ప్రోత్సహిద్దాం.”

వంగరి శ్రీధర్
*జిల్లా పౌర సంబంధాల అధికారి
*జగిత్యాల జిల్లా

చరిత్ర, ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యాల సమ్మేళనంగా జగిత్యాల జిల్లా….

🍎 పంచాంగము 28.09.2026

Leave a comment

Your email address will not be published. Required fields are marked *