3 రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె, ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు : జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్‌కుమార్
జగిత్యాల, :
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సంఘాలు ఈ నెల 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఈ సందర్భంగా మాట్లాడుతూ సమ్మె కారణంగా ఆయా రోజుల్లో జగిత్యాల జిల్లాలోని బ్యాంకు శాఖల్లో ప్రత్యక్ష సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.

సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు, కేంద్ర ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో 27న (ఆదివారం) బ్యాంకు శాఖలతో పాటు కరెన్సీ చెస్టులు కూడా యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఖాతాదారులు తమ అత్యవసర నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్ వంటి పనులను ఆదివారం రోజే పూర్తి చేసుకోవాలని సూచించారు.
డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
సమ్మె రోజుల్లో నేరుగా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేని లావాదేవీల కోసం అందుబాటులో ఉన్న డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. యుపిఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, ఏటిఎంల ద్వారా నగదు ఉపసంహరణ వంటి సేవలు యథావిధిగా లభిస్తాయని తెలిపారు. ఖాతాదారులు ముందస్తు ప్రణాళికతో తమ బ్యాంకింగ్ అవసరాలను పూర్తి చేసుకుని, బ్యాంకు యాజమాన్యానికి సహకరించాలని కోరారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





