# Tags
#politics #జగిత్యాల

నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో నూతన సబ్‌ స్టేషన్‌కు శుక్రవారం భూమిపూజ

👁 9 Views

జగిత్యాల :

ఉదయం 9:30 గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా భూమిపూజ

జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో శుక్రవారం (రేపు) నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి భూమిపూజ స్థలంపై జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అదనపు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో చర్చించారు.

జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీకి విద్యుత్ అవసరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నూతన సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ మేరకు శుక్రవారం ఉదయం 9:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా నూతన సబ్‌స్టేషన్‌కు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.

నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి ప్రస్తుతం ఉన్న నూకపల్లి సబ్‌స్టేషన్ సరిపోని పరిస్థితి నెలకొనడంతో నూతన సబ్‌స్టేషన్ మంజూరు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించి నూతన సబ్‌స్టేషన్‌ను మంజూరు చేశారనీ ఎమ్మెల్యే తెలిపారు.

గతంలో నూకపల్లి ప్రాంతంలో 4,520 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు కాగా, ప్రారంభ దశలో 2024 ముందు సుమారు 107 విద్యుత్ మీటర్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం అక్కడ 3,687 విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం జరిగింది.

అదనంగా కొత్తగా మంజూరవుతున్న ఇందిరమ్మ ఇళ్లను కలుపుకుంటే రానున్న రోజుల్లో మొత్తం 5,600కు పైగా విద్యుత్ కనెక్షన్లు అవసరమయ్యే అవకాశం ఉంది.

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి నూతన సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ నూతన సబ్‌స్టేషన్‌తో కాలనీ ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి ప్రసునంభ, మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, హౌసింగ్ పీడీ భాస్కర్, ఆర్డీవో మధుసూదన్, ఎంఆర్‌ఓ రామ్మోహన్, విద్యుత్ శాఖ డీఈ అధికారులు తదితరులు పాల్గొన్నారు.