స్వచ్ఛత హి సేవలో భాగంగా ఆరోగ్య శిబిరం, సేఫ్టీ కిట్ల పంపిణీ
జగిత్యాల
👉పట్టణంలో పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రతకు పెద్దపీట : మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రతిరోజూ పట్టణ పరిశుభ్రత కోసం శ్రమించే పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రతకు జగిత్యాల మున్సిపాలిటీ పెద్దపీట వేసింది. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని పారిశుధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరం నిర్వహించడంతో పాటు సేఫ్టీ కిట్లు, సబ్బులు, నూనెలు తదితర అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ. ….పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రతకు మున్సిపాలిటీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పట్టణ పరిశుభ్రత కోసం పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో కీలకమైనవని, వారు ఆరోగ్యంగా ఉంటేనే జగిత్యాల పట్టణం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు.

పారిశుధ్య విధుల్లో భాగంగా మురుగుకాలువల్లో పనిచేసేటప్పుడు, రోడ్లను శుభ్రం చేసేటప్పుడు ఇన్ఫెక్షన్లు, దుమ్ము తదితర వాటి నుంచి రక్షణ పొందేందుకు గ్లౌజులు, మాస్కులు, ఆప్రాన్లు వంటి రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. మున్సిపాలిటీ అందజేసిన సేఫ్టీ కిట్లను విధుల్లో సక్రమంగా ఉపయోగించుకోవాలని కోరారు.
అనంతరం పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ కిట్లు, సబ్బులు, నూనెలు తదితర అవసరమైన సామగ్రిని మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు కలిసి పారిశుధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో రక్షణ పరికరాలను సక్రమంగా వినియోగించుకోవాలని, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్యులు సూచించిన ఆరోగ్య జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని చైర్పర్సన్ సూచించారు. ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్, మహిళల కోసం నిర్వహించే ప్రత్యేక వైద్య శిబిరాల్లో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తమ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా పారిశుధ్య కార్మికులకు జీతాలు ఈ నెల 18వ తేదీ లోపు తప్పనిసరిగా అందేలా కమిషనర్‌తో మాట్లాడినట్లు చైర్పర్సన్ తెలిపారు. పారిశుధ్య కార్మికులకు పండుగల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీతాలు సకాలంలో అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పారిశుధ్య కార్మికులకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి మున్సిపాలిటీ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమకు అప్పగించిన విధులను బాధ్యతగా నిర్వహిస్తూ మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు.
“పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవను కేవలం జీతం తీసుకొని చేసే ఉద్యోగంగా మేము భావించడం లేదు. ఈ పని ఎంతో ప్రత్యేకమైనది. మీరు బాధ్యతగా విధులు నిర్వహిస్తూ మాకు సహకరిస్తే, మీకు అవసరమైన సహకారం అందించేందుకు మేము ఎల్లప్పుడూ ముందుంటాం” అని చైర్పర్సన్ పేర్కొన్నారు.
మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో రక్షణ పరికరాలను సక్రమంగా వినియోగించాలని, వైద్యులు సూచించిన ఆరోగ్య జాగ్రత్తలను పాటించాలని కార్మికులకు సూచించారు. పట్టణ పారిశుధ్య నిర్వహణలో కార్మికులు చేస్తున్న సేవలను అభినందిస్తూ, వారికి అవసరమైన సహకారం అందించేందుకు మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మానపురి పవిత్ర మహేష్, సామల జమున రాజశేఖర్, సుంకేటి మమత రామకృష్ణ రెడ్డి, అరవ లక్ష్మి, రాగుల ప్రదీప్, వేముల శ్రీనివాస్, క్యాదసు నవీన్, చీటి లక్ష్మీనారాయణ, వైద్యులు స్రవంతి, జాషువా కొంతమ్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





