# Tags
#Events #People #జగిత్యాల #తెలంగాణ

కుటుంబ విలువలను కాపాడాల్సిన బాధ్యత మహిళలదే..మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణిశ్రీనివాస్

👁 29 Views

జగిత్యాల :

కుటుంబ విలువలను, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మహిళలపైనే ఉందని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ అన్నారు.

వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో ఎనిమిదవ బ్యాచ్ లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ… మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి తమ కుటుంబానికి ఆర్థికచేయూతనందించాలనే ఉద్దేశంతో సేవా భారతి ఆధ్వర్యంలో గత మూడు నెలలు గా ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణను అందించడం అభినందనీయం అన్నారు.

ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించడంతోపాటు తమ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లులపైనే ఉంటుందన్నారు. తమ పిల్లలకు చదువుతోపాటు ఉత్తమ సంస్కారాన్ని కుటుంబ విలువలను అందించాలని సూచించారు.

ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించి పర్యావరణ పరిరక్షణ కోసం గృహిణులు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త గా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ భానుచందర్ మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకు ఉత్తమ విలువలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రపంచానికి గర్వకారణమైన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను, కుటుంబ విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మహిళలపైనే ఉందన్నారు. సేవా భారతి ద్వారా శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి పొందుతూ తమకు తోచిన రీతిలో సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డా. భీమానాతిని శంకర్ తో పాటుగా మున్సిపల్ కౌన్సిలర్ ప్రశాంత రావు, ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ పాక సత్యనారాయణ, సేవా భారతి జిల్లా అధ్యక్షుడు ఎస్పీ సుబ్రహ్మణ్యం, వాల్మీకి ఆవాస కార్యదర్శి మదన్మోహన్ రావు, ఆవాస సభ్యులు బెజ్జంకి సంపూర్ణ చారి, బొమ్మెర సత్యనారాయణ, స్రవంతి, శిక్షణ కేంద్రం ఇన్చార్జ్ కవిత మహిళలు పాల్గొన్నారు. అనంతరం శిక్షణ కేంద్రంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.