గోదావరి పుష్కరాల పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి : రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల :
👉 నవంబర్ 1 నుంచి మే 31 వరకు అన్ని పనులు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి
👉 పెండింగ్ భూసేకరణ నోటిఫికేషన్లను సోమవారం నుంచి జారీ చేయాలి
👉 నెలవారీ లక్ష్యాలతో అవసరం అయితే రాత్రింబవళ్లు పనులు చేపట్టాలి… జాప్యం జరిగితే జిల్లాకు చెడ్డపేరు వస్తుంది
👉 గోదావరి మహా పుష్కరాలు-2027 ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ప్రసునాంబలతో కలిసి అధికారులతో మంత్రి సమీక్ష

2027లో నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాలకు సంబంధించి చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
గురువారం జగిత్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ప్రసునాంబలతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, పుష్కరాల పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, పనులను సకాలంలో పూర్తి చేయకపోతే జిల్లాకు చెడ్డపేరు వస్తుందని అన్నారు. ప్రతి పనికి స్పష్టమైన షెడ్యూల్ రూపొందించుకొని, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు చేపట్టే ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ, అవసరమైన చోట జనరేటర్లు ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు పనులు చేపట్టాలని సూచించారు.
నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 30వ తేదీ వరకు అన్ని శాఖలు తమ పరిధిలోని పనులను పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటి ప్రకారం పనుల పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, హెడ్ ఆఫీస్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న అంశాలను ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్లను సోమవారం నుంచి జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఆర్ అండ్ బి రోడ్లకు సంబంధించి 10-ఏ మినహాయింపు ప్రతిపాదనలు పంపించామని, అనుమతులు మూడు రోజుల్లో అందితే వెంటనే భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేయాలని సూచించారు. ముందుగా భూమిని సేకరించి, పరిహారం చెల్లింపులు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ధర్మపురిలో మహాలక్ష్మి ఘాట్, రోడ్డు విస్తరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపులను మూడు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ధర్మపురి ఘాట్‌ను 270 మీటర్ల పొడవుతో అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణకు సంబంధించిన కూల్చివేత పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని, కోటిలింగాల ఆలయ కూల్చివేత పూర్తయినందున అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులు రానున్న నేపథ్యంలో రోడ్లపై ఎట్టి పరిస్థితులలో ట్రాఫిక్ జామ్ జరగకుండా ముందస్తు పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వాహనాలు సులభతరంగా వెండే విధంగా రూట్ మ్యాప్ లను సిద్ధం చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ పుష్కరాలకు సంబంధించిన పనులు వేగవంతంగా పూర్తి అయ్యేవిధంగా చూడాలని అధికారులకు సూచించారు. మే 31,2027 నాటికి ప్రతిపాదించిన పనులు పూర్తి చేసుకోగలిగితేనే పుష్కరాలకు వచ్చే కోట్లాది భక్తులకు అసౌకర్యం కలగకుండా ధార్మికంగా పుణ్యస్నానాలు దైవదర్శనం సజావుగా జరుగుతుందని ఆదేశాగా మనం ముందస్తు ఏర్పాట్లు చేయాలని అన్నారు
గత పుష్కర స్నానాల సమయంలో మురికి నీరు, కొంత గోదావరి నదిలో కలవడం వల్ల వివాదం అయిందని ఆ పరిస్థితి రాబోయే పుష్కరాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సివరేజ్ పనుల కోసం అవసరమైతే అదనపు బడ్జెట్ కేటాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని దేశంలో ఈ పనులు వేగవంతంగా నాణ్యతతో చేపట్టే వారిని గుర్తించి తీసుకొని రావాలని మంత్రి తెలిపారు.

👉 జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ, 2015 గోదావరి పుష్కరాల సమయంలో సుమారు 1.50 కోట్ల మంది భక్తులు వచ్చారని, 2027 పుష్కరాలకు సుమారు 2.40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఒక్క ధర్మపురి ప్రాంతానికే సుమారు కోటి మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ అంచనాల ఆధారంగా మండలాలు, ఘాట్ల వారీగా భక్తుల రాకపోకలను విశ్లేషించి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు రూపొందించినట్లు వివరించారు.
ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో కోటి మంది, ధర్మపురి మండలంలో 60 లక్షల మంది, వెల్గటూర్‌లో 40 లక్షల మంది, ఇబ్రహీంపట్నంలో 23 లక్షల మంది, మల్లాపూర్‌లో 15 లక్షల మంది, రాయికల్‌లో 5 లక్షల మంది, బీర్పూర్లో 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు.
ధర్మపురి ప్రాంతంలో హనుమాన్ గడ్డ ఘాట్, పాత వీఐపీ ఘాట్, మంగలి ఘాట్, హరిత ఘాట్, మహాలక్ష్మి ఘాట్ తదితర ఘాట్లతో పాటు వెల్గటూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, బీర్పూర్, రాయికల్ మండలాల్లోని వివిధ గ్రామాల వద్ద ఘాట్ల అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు.
గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు సంబంధించి మొత్తం రూ.226.41 కోట్ల బడ్జెట్ మంజూరైందని కలెక్టర్ తెలిపారు. ఇందులో టైర్-1 పనులకు రూ.206.42 కోట్లు, టైర్-2, టైర్-3 పనులకు రూ.19.99 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, నీటిపారుదల, దేవదాయ, ప్రజారోగ్యం, విద్యుత్, మున్సిపల్, పర్యాటక, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వైద్య శాఖకు సంబంధించిన అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు ఇంకా విడుదల కావాల్సి ఉందని పేర్కొన్నారు.
ధర్మపురిలో ప్రస్తుతం ఉన్న ఘాట్‌ను 270 మీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.22.16 కోట్లతో పనులు చేపట్టగా, టెండర్లు ఖరారై పనులు ప్రారంభమైనట్లు కలెక్టర్ తెలిపారు. ధర్మపురిలో కొత్తగా 30 మీటర్ల ఘాట్ నిర్మాణానికి రూ.6 కోట్లు, కోటిలింగాలలో 210 మీటర్ల ఘాట్ అభివృద్ధికి రూ.16.13 కోట్లు కేటాయించినట్లు వివరించారు. రాయపట్నం, తిమ్మాపూర్, రాజారం, ఎర్దండి, కొమటి కొండాపూర్, బర్తిపూర్, వేములకూర్తి, రత్నలమడుగు, ఫకీర్ కొండాపూర్, వల్గొండ తదితర ప్రాంతాల్లో కొత్త ఘాట్ల నిర్మాణం, నిర్వహణ పనులకు రూ.11.99 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ధర్మపురి వీఐపీ ఘాట్ రహదారి నిర్మాణం, రెండు వంతెనలు, హెలిపాడ్ ఏర్పాటుకు సంబంధించిన పనులు, నంది విగ్రహం నుంచి ధర్మపురి ఆలయం వరకు సీసీ రోడ్డు విస్తరణ, కోటిలింగాల ఆలయానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణం తదితర పనుల వివరాలను కలెక్టర్ వెల్లడించారు. కమలాపూర్, తిమ్మాపూర్, అక్షయపల్లి రహదారులు, వివిధ బైపాస్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు కూడా చేపడుతున్నట్లు తెలిపారు.
ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో రూ.15 కోట్లతో 46 అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు మంజూరయ్యాయని, వీటిలో 33 పనులకు ఎల్ఓఏ జారీ చేసినట్లు కలెక్టర్ వివరించారు. మిగిలిన పనులకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ధర్మపురి, వెల్గటూర్ ప్రాంతాల్లోని ఘాట్లు, పార్కింగ్ స్థలాలు, రహదారుల వద్ద లైటింగ్ ఏర్పాట్లకు రూ.6 కోట్లు కేటాయించగా, రూ.5.46 కోట్లకు పైగా అంచనాలతో పనులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

పుష్కరాల సందర్భంగా 12 రోజుల పాటు అవుట్డోర్ ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు, ధర్మపురి హరిత హోటల్ మరమ్మతులు, పునరుద్ధరణ పనులను చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఘాట్లు, భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అవసరమైన పనులు చేపడుతున్నట్లు వివరించారు.
రోడ్ల విస్తరణ, ఘాట్ల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ వివరాలను కలెక్టర్ సమీక్షించారు. ధర్మపురి మహాలక్ష్మి ఘాట్, రహదారుల విస్తరణకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పరిహారం చెల్లింపులను మూడు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భూమి అందుబాటులోకి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించారు.
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.10 కోట్లు, కోటిలింగాల ఆలయ పునరుద్ధరణకు రూ.10 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. ధర్మపురి ఆలయ అభివృద్ధికి భూసేకరణ కోసం రూ.20 కోట్లు జమ చేయగా, పరిహారం చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.
పుష్కరాల సమయంలో వైద్య శిబిరాలు, అత్యవసర వైద్య సేవల కోసం రూ.2.77 కోట్ల అదనపు నిధులు, శాంతిభద్రతల నిర్వహణ కోసం పోలీసు శాఖకు రూ.5.21 కోట్ల అదనపు నిధుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు.
పుష్కరాల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రహదారులు, ఘాట్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత, వైద్య సేవలకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
గోదావరి నదిలో మురుగునీరు కల్వకుండ అవసరమైన ఎస్టిపిల నిర్మాణం లేదా మురుగునీటి డైవర్షన్ సంబంధిత పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా చూడాలని అన్నారు.
ముఖ్యమంత్రి మంత్రులు ఇతర నాయకులు ప్రముఖులు గోదావరి పుష్కర స్నానాలకు ధర్మపురి వచ్చినట్లయితే వారికి ప్రత్యేకంగా వీఐపీ రోడ్డు ఏర్పాటు కోసం హైదరాబాద్ స్థాయిలో ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ మంత్రికి విజ్ఞప్తి చేశారు
వీఐపీ రోడ్డు, ధర్మపురి ఆలయ మాడవీధుల అభివృద్ధి కోసం అవసరమైన భూసేకరణ చేసేందుకు అట్టనే మినహాయింపు కోసం ప్రతిపాదనలు సమర్పించామని ఇవి తొందరగా వస్తే పనులు వేగవంతంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
మాడ వీధుల అభివృద్ధికి అవసరం భూసేకరణ కోసం 24 కోట్లు, పంచాయతీరాజు రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు 8 కోట్లు, విఐపి రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరాన్ని మిత్తం 8 కోట్లు అవసరం ఉంటాయని ఈ నిధులు వీలైనంత త్వరగా జిల్లాకు చేరేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.
గోదావరి పుష్కరాల సమయంలో అవసరమైన మేర పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, పోలీస్ శాఖ అధికారులతో సమయాన్ని చేసుకుంటూ ఎక్కడ పార్విన్ ఏర్పాట్లు ఎంత మేరకు చేయాలో తుది ప్లాన్ ను 10 రోజులలో అందిస్తామని అన్నారు.
👉 ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, పుష్కరాల భద్రత కోసం మొత్తం 9,978 మంది పోలీసు సిబ్బందితో పాటు 22 అదనపు బలగాల యూనిట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. ధర్మపురిలో 4,010 మంది సిబ్బంది, 12 యూనిట్లు, బీర్పూర్లో 1,990 మంది సిబ్బంది, 10 యూనిట్లు, వెల్గటూర్‌లో 1,861 మంది, మల్లాపూర్‌లో 1,051 మంది, రాయికల్‌లో 626 మంది, ఇబ్రహీంపట్నంలో 440 మంది సిబ్బందిని కేటాయించేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.
భారీ సంఖ్యలో వచ్చే భక్తులను ఉద్దేశించి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు రాకుండా అవసరమైన మేర రోడ్డు డైవర్షన్స్ చేపడతామని రోడ్లలో ఎక్కడ కూడా ఎటువంటి సమస్య రాకుండా ముందస్తుగానే పరిశీలిస్తామని ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఎక్కడికక్కడ సిబ్బందిని ఏర్పాటు చేస్తూ సజావుగా పుష్కరాలను నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు
వివిధ జిల్లాలో మార్గాల నుంచి పుష్కరాలకు వచ్చే భక్తులకు సరైన పార్కింగ్ సౌకర్యం ఉండే విధంగా ప్రణాళికల సిద్ధం చేస్తున్నామని ప్రతి రూటుకు సెపరేట్ పార్కింగ్ ఏరియాలో ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్. దినేష్, ఆర్.డి.ఓ. లు, పి.ఆర్, ఆర్&బి, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ , దేవాదాయ, మున్సిపల్, రెవెన్యూ , పోలీస్ శాఖల అధికారులు , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





