గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్ష
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల :
గోదావరి పుష్కరాలు–2027 నేపథ్యంలో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ధర్మపురి, కోటిలింగాల, వెల్గటూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, బీర్పూర్, రాయికల్ మండలాల పరిధిలోని గోదావరి తీర ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పుష్కరాల సందర్భంగా జిల్లాలో సుమారు 2.40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.

పుష్కరాల ఏర్పాట్ల కోసం వివిధ శాఖలకు కలిపి రూ.220.41 కోట్ల నిధులు మంజూరైనట్లు వివరించారు. ఇరిగేషన్, ఎండోమెంట్స్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ప్రజారోగ్యం, నీటి సరఫరా–పారిశుధ్యం, పర్యాటకం తదితర శాఖల ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు.
ధర్మపురి ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.10 కోట్లు, కోటిలింగాల ఆలయ పునరుద్ధరణకు రూ.10 కోట్లు మంజూరై పనులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. కోటిలింగాల ఆలయ పునరుద్ధరణలో భాగంగా పాత ఆలయ కూల్చివేత పనులు పూర్తయ్యాయని వివరించారు.
ధర్మపురి, కోటిలింగాల ఘాట్ల విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ధర్మపురి ఘాట్లకు, కోటిలింగాల ఘాట్‌కు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.

పుష్కరాలకు వచ్చే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారుల అభివృద్ధి, విస్తరణ, ఘాట్లకు అనుసంధాన రహదారుల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాల్లో పలు రహదారి పనులకు టెండర్లు ఖరారైనట్లు అధికారులు తెలిపారు.
భక్తులకు నిరంతర తాగునీటి సరఫరా, పారిశుధ్య సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ధర్మపురి మున్సిపాలిటీకి రూ.2 కోట్లు, కోటిలింగాలకు రూ.48 లక్షలతో శాశ్వత నీటి సరఫరా, పారిశుధ్య సదుపాయాల పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
పుష్కరాల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అవసరమైన విద్యుత్ మౌలిక వసతులను ముందుగానే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ ఘాట్లు, పార్కింగ్ ప్రాంతాలు, ఆలయాల పరిసరాల్లో తాత్కాలిక, శాశ్వత విద్యుత్ ఏర్పాట్లను చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.
భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఘాట్ల వద్ద పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, అత్యవసర సేవలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
వైద్య శిబిరాలు, పారిశుధ్య సిబ్బంది, తాగునీరు, విద్యుత్, రహదారులు, పార్కింగ్ తదితర అన్ని అంశాల్లో శాఖల మధ్య సమన్వయం ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతి శాఖకు కేటాయించిన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్, ఆర్డీవోలు, కలెక్టరేట్ ఏవో కిషన్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు, తహసీల్దార్ లు, ఎంపిడివోలు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





