# Tags
#తెలంగాణ

14 గంటల్లోనే పవన్ సింగ్ హత్య కేసు ఛేదించిన పోలీసులు.

👁 11 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం:

టైల్స్ వర్క్ కాంట్రాక్టర్ పవన్ సింగ్ హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌.

డబ్బుల కోసమే హత్య చేసినట్లు పోలీసుల వెల్లడి.. రైల్వే స్టేషన్‌లో పట్టుకుని రిమాండ్‌కు తరలింపు.

రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రిపోర్టర్ (సంపత్ పంజ) :

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో సంచలనం సృష్టించిన టైల్స్ వర్క్ కాంట్రాక్టర్ పవన్ సింగ్ హత్య కేసును పోలీసులు కేవలం 14 గంటల్లోనే ఛేదించారు.

డబ్బుల కోసం తమతో కలిసి పనిచేస్తున్న టైల్స్ పనుల కూలీలు, మృతునికి వరుసకు బావమరిది అయిన రాజస్థాన్ కు చెందిన జోగిందర్, ఉత్తరఖండ్ కు చెందిన శివం ఆగ్రా ఉత్తర ప్రదేశ్ కు చెందిన టైల్స్ కాంట్రాక్టర్ పవన్ ను (28 ) ఇంట్లో కూరగాయలు కోసే కత్తితో ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో మెడపై గొంతు పై కోసి చాతి పై పొడిచి హత్య చేసి తలుపులు పెట్టి పవన్ కు చెందిన ద్విచక్ర వాహనంపై పరారైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన జోగిందర్, శివమ్‌లను వీర్నపల్లి ఎస్సై లక్ష్మణ్ ప్రత్యేక పోలీసు బృందం రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసింది. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

👉 ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ నాగేంద్రచారి మీడియా సమావేశం….

గురువారం ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ కత్తురోజు నాగేంద్రచారి హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గొల్లపల్లి గ్రామంలో జరిగిన ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు వివరించారు. సీఐ ఓ. వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులు పరారైన మార్గాలు, అందుబాటులో ఉన్న ఆధారాలపై దృష్టి సారించారు.

👉 టైల్స్ కాంట్రాక్టర్ పవన్ సింగ్ హత్య.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవన్ సింగ్ టైల్స్ వర్క్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. వివిధ ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు టైల్స్ బిగించే పనులు చేపడుతూ, తన రాష్ట్రానికి చెందిన ఇతర కూలీలను కూడా పనుల నిమిత్తం తీసుకువచ్చేవాడని తెలిసింది. ఈ క్రమంలో గొల్లపల్లి గ్రామంలో పనులు నిర్వహిస్తున్న సమయంలో పవన్ సింగ్ హత్యకు గురయ్యాడు.

గొల్లపల్లిలోని శాతవాహన కాలనీ సమీపంలో నూతనంగా నిర్మించిన భవనానికి సంబంధించిన గదిలో ఈ ఘటన వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి, హత్య జరిగిన గది, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ సహాయంతో కీలక ఆధారాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు.

👉డబ్బుల కోసమే హత్య చేసినట్లు వెల్లడి.

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. పవన్ సింగ్‌తో కలిసి పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలు జోగిందర్, శివమ్ డబ్బుల కోసం ఈ హత్యకు పాల్పడినట్లు వెల్లడైంది.

హత్య అనంతరం అక్కడి నుంచి పరారైన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసును సవాలుగా తీసుకున్న సీఐ వెంకటేష్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం సాంకేతిక, ఇతర ఆధారాల సహాయంతో దర్యాప్తును ముమ్మరం చేసింది.

ఈ క్రమంలో పరారీలో ఉన్న జోగిందర్, శివమ్‌లను రైల్వే స్టేషన్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి, చట్టపరమైన ప్రక్రియ పూర్తిచేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ నాగేంద్రచారి మీడియాకు వివరించారు.

హత్య జరిగిన కొద్ది గంటల్లోనే దర్యాప్తును వేగవంతం చేసి, 12 గంటల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ నాగేంద్రచారి అభినందించారు. ఈ కేసులో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందించేందుకు సిఫారసు చేస్తానని తెలిపారు.

గొల్లపల్లిలో టైల్స్ వర్క్ కాంట్రాక్టర్ పవన్ సింగ్ హత్య స్థానికంగా కలకలం రేపగా, పోలీసులు వేగంగా స్పందించి నిందితులను పట్టుకోవడంతో కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది.
మీడియా సమావేశంలో ఎల్లారెడ్డి పేట సి ఐ ఓ.వెంకటేష్,ఎల్లారెడ్డి పేట ఎస్ ఐ ఎన్.రమేష్ గౌడ్,వీర్నపల్లి ఎస్ ఐ లక్ష్మణ్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.