70 శాతం ఎస్ఐఆర్ పనులు పూర్తి చేసినందుకు ప్రత్యేక అభినందనలు : ఎలక్టరోల్ అబ్జర్వర్ బాల మాయ దేవి
జగిత్యాల :
* ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలి
* అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు
* బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి నోటీసులు, దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి
* ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి
జగిత్యాల, అక్టోబర్ 06 :
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బాల మాయ దేవి అధికారులను ఆదేశించారు.
అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, అనర్హులైన లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పేర్లపై చట్టబద్ధమైన విధానాలను అనుసరిస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బాల మాయ దేవి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎలక్టోరల్ అబ్జర్వర్ బాల మాయ దేవి మాట్లాడుతూ….ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. హెల్ప్‌డెస్క్‌ల వద్దకు వచ్చే ఓటర్లకు దరఖాస్తుల విధానం, అవసరమైన పత్రాలు, నోటీసులకు సంబంధించిన వివరాలను స్పష్టంగా తెలియజేసి, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని సూచించారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇప్పటివరకు సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని అభినందించారు. అలాగే మిగిలిన 30 శాతం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. రానున్న దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో చివరి నిమిషంలో పనులపై ఒత్తిడి పెరగకుండా ముందస్తు ప్రణాళికతో పనులను వేగవంతం చేయాలని తెలిపారు. చివరి నిమిషంలో హడావుడిగా పనులు చేపట్టడం వల్ల పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నందున ముందుగానే పెండింగ్ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంలో సరైన డాక్యుమెంటేషన్ ఉండేలా చూడాలని, అన్ని గణాంకాలు, వివరాలు పరస్పరం సరిపోలే విధంగా రీకన్సిలియేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ చట్టబద్ధమైన బాధ్యతతో కూడుకున్నదని, భవిష్యత్తులో ఏదైనా పరిశీలన లేదా న్యాయపరమైన సమీక్షకు గురయ్యే అవకాశం ఉన్నందున రికార్డుల నిర్వహణలో అత్యంత జాగ్రత్త వహించాలని తెలిపారు.

ఓటర్ల పేర్ల తొలగింపు ప్రక్రియ అత్యంత సున్నితమైన అంశమని, ప్రతి డిలీషన్ను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే చర్యలు చేపట్టాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ సూచించారు. సంబంధిత వ్యక్తులకు చట్టబద్ధమైన నోటీసులు అందించి, అవసరమైన సందర్భాల్లో విచారణకు తగిన సమయం కల్పించిన తరువాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అదేవిధంగా అర్హత కలిగిన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చేందుకు ఫారం-6 ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా సమయానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఒకే ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో డిలీషన్లు లేదా ఇంక్లూజన్లకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లయితే వెంటనే ప్రత్యేకంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎస్ఐఆర్లో భాగంగా జారీ చేసిన నోటీసులు సంబంధిత వ్యక్తులకు సక్రమంగా అందేలా ఏఈఆర్వోలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నోటీసుల పంపిణీ, దరఖాస్తుల పరిశీలన, పెండింగ్ పనుల పురోగతిపై ప్రతిరోజూ ఫాలోఅప్ నిర్వహించాలని తెలిపారు.
సూపర్వైజర్లు, బీఎల్ఓలతో అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. బీఎల్ఓలతో పాటు బూత్ లెవల్ ఏజెంట్ల భాగస్వామ్యంతో ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి నోటీసుల పరిశీలన, సంబంధిత పత్రాల స్వీకరణ, దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లను అవసరం లేకుండా కార్యాలయాలకు పిలిపించకుండా, సాధ్యమైనంత వరకు వారి ఇళ్ల వద్దనే వివరాలను పరిశీలించి అవసరమైన పత్రాలను స్వీకరించాలని సూచించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి వారం సమావేశాలు నిర్వహించి, ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం, పెండెన్సీ తదితర అంశాలపై తాజా పురోగతి వివరాలను పారదర్శకంగా తెలియజేయాలని సూచించారు.
ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలని, ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. నోటీసులు జారీ చేసిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన పత్రాలను సేకరించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు.
రానున్న పండుగల సెలవులను దృష్టిలో ఉంచుకుని మిగిలిన పనులను ముందుగానే ప్రణాళిక చేసుకుని వేగవంతం చేయాలని, చివరి నిమిషంలో హడావుడి లేకుండా నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి, నరసింహరావు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ఎన్నికల అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





